నవ్వుల మునిపుంగవుడు - ప్రసాదమూర్తి (28-Jan-2015)

అంద్రజ్యోతి ఆన్ లైన్ వచ్చిన ఈ అర్ట్కల్ నిజంగా నాకు మాటలు రావటం లేదు  ms నారాయణ గారు మీ ఆత్మా శాంతికి మేము దేవుని ప్రదిస్తునం 
                                 ఎర్రగడ్డ హిందూ స్మశానవాటిక దగ్గరకు ఆ రోజు (జనవరి 24) పదిగంటలకే చేరుకున్నాను. అక్కడ మూడో నెంబరు దహన వేదిక స్తంభం మీద ఎం.ఎస్‌.నారాయణ, వెంకటగిరి అని రాసివుంది. కోట్లాది తెలుగు సినీప్రేక్షకుల హృదయాల్లో నవ్వుపూల రేకులతో తన పేరు రాసుకున్నవాడు. ఈ స్థలంలో ఇక్కడ అతని పేరు కాలమే రాసి వుంటుంది. ఇదొక అనివార్యమైన ఆఖరి మజిలీ కదా. జీవితంలో ఎన్నో మజిలీలు చుట్టినవాడు. మరెన్నో మలుపులు తిరిగి ఇంకెన్నో గెలుపులు గెల్చుకోవాల్సినవాడు. అప్పుడే ఈ చివరి మజిలీకి చేరుకోడానికి ఎందుకంత తొందరపడ్డాడో గుండె కళ్లల్లోకి వచ్చి కరిగినీరైనట్టయింది.
                                 జీవన సారాన్ని సేవించిన స్నేహతాత్త్వికుడు ఎమ్మస్‌. ఎప్పుడైనా అలా ఎర్రగడ్డ మీదుగా వెళితే ఆ అల్టిమేట్‌ డెస్టినేషన్‌ వైపు చూస్తాను. ఏమో మా ఎమ్మెస్‌ నారాయణ నవ్వుల మునిపుంగవుడిలా బయటకొస్తాడేమో!
                                 అన్నయ్యా అంటే తమ్ముడూ ఎక్కడున్నావురా అని ఆప్యాయంగా పిలిచేవాడు. పిలవడమే కాదు ఉన్నపళంగా రా..మనం కవిత్వం చదువుకుందాం అనేవాడు. అతని కారులో కూర్చుని.. తనతోపాటు నగర సంచారం చేయడం ఓ అందమైన అనుభూతి. ఏదో ఒక కూడలిలో ఆయన కోసం ఎదురు చూసే నన్ను పిక్‌ చేసుకునేవాడు. అప్పుడు కారు నగరం శివారులో సవారు తీసిందో లేక నగరమే కారు వెనక పరుగులు తీసిందో తెలిసేది కాదు. కవిత్వం వింటూ సీరియస్‌గా అయిపోయేవాడు. చాలాసార్లు కన్నీరు బొటబొటా కార్చేవాడు. అంత లోనే జోక్స్‌ పేల్చేవాడు. దశాబ్దాల సినిమా అనుభవంలోంచి ఆయన చెప్పేసంఘటనలు.. వర్ణించే సన్నివేశాలు.. వదిలే హాస్య చతురోక్తులకు కారు కూడా కడుపుబ్బా నవ్వుకునేదేమో అనిపించేది. డ్రైవర్‌ నవ్వలేక పొట్టపట్టుకోవడం కోసం స్టీరింగ్‌ వదిలేస్తాడేమో అనుకునేవాళ్ళం.
                                  

                                    ఇప్పుడు అన్నయ్య రాకకోసం ఒక స్మశాన వాటికలో ఎదురు చూస్తున్నాను. కారులోనే వచ్చాడు కాని అది నవ్వులు మోసుకొచ్చిన కారు కాదు. అందులో నన్ను తమ్ముడూ అని వాటేసుకోవడానికి అన్నయ్య లేడు. అన్నయ్య వున్నాడు. కానీ అన్నయ్య లేడు. అన్నయ్య అమెరికా తొలిసారి వెళ్ళినప్పుడు, అప్పుడు యు.ఎస్‌.లో వుంటున్న మిత్రుడు కుమార్‌ అర్జంటుగా ఓ కవిత రాసి పంపమన్నాడు. నవ్వుల సూట్‌ కేసుతో అమెరికా అని రాసి పంపించాను. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? ఏం తీసుకు వెళుతున్నాడు? తనకేమిచ్చి పంపాలి? నవ్వుల సూట్‌ కేసుతో స్వర్గానికి అని రాయనా. అక్షయపాత్ర లాంటి ఆయన సూట్‌ కేసులో అన్నీ నవ్వులే కదా. ఏ దిక్కుల్ని నవ్వించడానికి.. ఏ చుక్కల్ని నవ్వించడానికి.. మనకు కనపడని ఎవరెవరికి కితకితలు పెట్టడానికి వెళ్ళాడు? ఎంత ప్రేమ కురిపించేవాడు! ఎంత చల్లగా వాటేసుకునేవాడు!


                                ఒకే వూళ్ళో పుట్టాం. ఒకే కాలేజీలో ఒకే కోర్సు చదువుకున్నాం. నాకంటే పదేళ్ళు పెద్దవాడు. అందుకే నన్ను చిట్టితమ్ముడిలా చూసుకునే వాడు. మా వూళ్లో రెండు చెరువులు. ఒకటి పెద్ద చెరువు.. రెండోది చిన్నచెరువు. పెద్దచెరువు గట్టుమీద అతని ఇల్లు.. చిన్నచెరువు గట్టు మీద మాఇల్లు వుంటాయి. ఊరంటే కక్షలు కార్పణ్యాలే అన్న జ్ఞాపకాలు వెంటాడే బాల్యం నాది. అందుకే అతని ప్రేమను పొందడం ఎంతో గర్వంగా ఉండేది. నిడమర్రు పెద్ద చెరువులో వేయి రేకుల నవ్వులతో వికసించిన తెల్లతామర పువ్వువు నువ్వు అనే వాడిని. మురిసిపోయే వాడు. బాల్యంలోకి వెళ్ళిపోయేవాడు. కథలు కథలుగా తనను తాను విప్పుకునేవాడు. కొట్టుకోవడం చంపుకోవడం అలవాటుగా మార్చుకున్న వూరు మాది. ఎందుకు అలా జరిగేది? ఎంతో మేధస్సుతో కూడిన సామాజిక ఆర్థిక విశ్లేషణలతో మా వూరులాంటి ఎన్నో వూళ్ళ చరిత్రలు వివరించేవాడు. వాతావరణం బరువెక్కింది అనుకుంటే ఒక జోక్‌తో తేలికచేసి అందరి హృదయాలకూ గిలిగింతలు పెట్టేవాడు. కర్రలూ బరిసెలూ కదనుతొక్కే పొగరుమోతు మట్టిలో మొలకెత్తిన మమతల మల్లిచెట్టువు నువ్వు అని అంటే మనం చూసిన చెడు మనల్ని మంచి వైపు నడిపించాలని నవ్వేవాడు. గోర్కి అమ్మ నవలను తొలిసారి తెలుగులో అనువదించి ముద్రించిన నిడమర్తి ఉమారాజేశ్వరరావు మా వూరివాడే. మనది ఆ వారసత్వమే అంటే ఎంతో పొంగిపోయేవాడు. మొత్తానికి విద్వేషాల నిడమర్రును చిరునవ్వుల చిరునామాగా మార్చి అన్ని వూళ్ళ గోపురాల మీదా ఎగరాల్సింది నవ్వుల జెండాలే అని తేల్చేశాడు. 


                                      ఆయనతో ఎవరూ వాదించి నెగ్గిన దాఖలాలులేవు. వాదనలో కూడా చల్లగా వుండి లాజిక్కుతో గెలిచేవాడు. తెరమీద తాగుబోతు పాత్రలు మాత్రమే తెలిసిన వారికి ఎమ్మెస్‌ గురించి తెలిసింది చాలా తక్కువ. కాళిదాసు నుంచి తిలక్‌ దాకా అలవోకగా ఉదాహరణలు చూపేవాడు. తప్పనిసరై ఇష్టంలేని జంధ్యాన్ని వేసుకుని సంస్కృతం నేర్చుకున్నవాడు కదా. అలవోకగా శ్లోకాలు వల్లించేవాడు. కాళిదాసునీ భవభూతినీ అందరి మధ్యకూ తీసుకొచ్చేవాడు. పురాతన కావ్యాలు చదవకుండా కవిత్వాన్ని రాయలేరని ఘంటాపథంగా చెప్పేవాడు. నా కవిత్వాన్ని వినడానికి నలుగుర్ని పోగేసి అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించే వాడు అన్నయ్య. ఇప్పుడెవరికి వినిపించాలి? నచ్చితే ఎందుకు నచ్చిందో నచ్చకుంటే ఎందుకు నచ్చలేదో గుణదోషాలను ఏకబిగిన వివరించే గొప్ప ఆలంకారికవేత్త నాకెక్కడ దొరుకుతాడు?
నవ్వుతూ బతకడమే కాదు నవ్వుతూ చావడం కూడా ఎమ్మెస్‌ ఎంచుకున్న మార్గమే అనుకుంటా. హాయిగా వున్నాం. హాయిగానే పోవాలనేవాడు. బహుశా ఆ పనిమీదే అంత హడావుడిగా తను పుట్టి పెరిగిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ మిత్రుల్ని కలుసుకోవడం కోసం ఒకటే ఉరుకులు పరుగులు తీశాడు. ఒక్క నిమిషం తీరిక లేకుండా తనిక వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని తెలిసినట్టే చివరి క్షణాలను కూడా వృధాపోనివ్వకూడదనే ఆత్రం పడ్డాడు. భీమవరం నుండి కిమ్స్‌.. అక్కడి నుండి ఫిల్మ్‌ ఛాంబర్‌.. అటు నుండి వెంకటాద్రి ఇంటికి.. అక్కడి నుండి నేరుగా ఎర్రగడ్డ బరియల్‌ గ్రౌండ్‌. ఎమ్మెస్‌ని చివరిసారి చూడాలని నాలాగే ఎవరెవరో వచ్చారు. ఇంతకాలం తమకోసం నవ్వులు పంచిన కమెడియన్‌కి నవ్వులతో వీడ్కోలు చెప్పాలన్నా ఎవరి వశమూ కాలేదు. అందుకే అందరూ కన్నీరింకిన కర్చీఫ్‌లతోనే కడసారి చూపుల జెండాలూపారు.


                                          ఎమ్మెస్‌ తాగుబోతు కాదు. జీవన సారాన్ని సేవించిన స్నేహతాత్త్వికుడు. ఎప్పుడైనా అలా ఎర్రగడ్డ మీదుగా వెళితే ఆ అల్టిమేట్‌ డెస్టినేషన్‌ వైపు చూస్తాను. ఏమో మా ఎమ్మెస్‌ నారాయణ నవ్వుల మునిపుంగవుడిలా బయటకొస్తాడేమో!
 ప్రసాదమూర్తి

0 comments: